Sri Matsya Mahapuranam-1    Chapters   

ఓమ్‌

శ్రీమత్స్య మహాపురాణము

పురాణములు-వాని లక్షణము - విశిష్టత.

భారతీయుల చిత్తవృత్తులు అన్ని యును ఐహికము వైపునకు కంటె ఆముష్మికము వైపునకు ఎక్కువ మ్రొగ్గుతో సాగుచు ఉండుట అతి ప్రాచీన కాలమునుండి నేటివరకును అవిచ్ఛిన్నముగ సాగివచ్చుచున్న విషయము. ఇకముందు కూడ ఈ విధానము ఇట్లే ఏనాటి వరకయినను కొనసాగుచుండును. ఇందు ఏమాత్రమును సందియములేదు.

'ఐహిక జీవనమునందలి ప్రతి ఒక అంశమును ఈ ఐహిక జీవనమునకు తరువాత పారలౌకిక జీవనమందలి సుఖలబ్ధికి ఏమాత్రమును విరుద్ధము కారాదు.' అనునది మనవారి ముఖ్యోద్దేశము. మన పూజ్య ఋషులను తాము ప్రవచించిన సర్వ ధర్మములను ఇందులకు తగినట్లుగనే మనకు ఆదేశించియు ఉపదేశించియు మనలను ఉత్తమమగు మార్గమున నడిపించిరి; నడిపించుచు ఉన్నారు. అనాదిగా మన దేశమునందలి శిష్టులు అందరును ఆయా ధర్మములను తాము ఆ దృష్టితోనే అనుష్ఠించుచు మానవ సమాజమునకు మార్గదర్శకులుగా ఉండుచు వచ్చిరి. పురాణ వాఙ్మయము ఈ పరమార్థ దృష్టి ప్రధానమగు భారతీయ ధర్మదృష్టికి నిదర్శనములును ధర్మ ప్రవృత్తికి ఆలంబనములను అయి ప్రకాశించుచున్నవి. కనుకనే శ్రీ వ్యాస భగవానులు :

''అష్టాదశ పురాణానాం | నామధేయాని యః పఠేత్‌|

త్రిసంధ్యం జపతే నిత్యం | సో7శ్వమేధఫలం లభేత్‌.''

''ప్రతి దినమునను ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యాకాలముల మూడింటియందును అష్టాదశ మహా పురాణముల నామధేయములను పఠించుచు-జపించుచు-ఉండువారు అశ్వమేధయాగము ఆచరించినందున పొందదగిన ఫలమును పొందుదురు.'' (మార్కం. పురా.) అని వచించిరి.

ఐహికములను ఆముష్మికములను అగు సర్వ సుఖములను మానవ సమాజమునకు మాత్రమేకాదు-సర్వ ప్రాణులకును-సంపన్న మగునట్లు చేయుటలో శ్రుతులతోను స్మృతులతోను పాటుగ పురాణములకు కూడ ప్రామాణ్యము కలదు. అని స్మృతిపురాణ-వచనములు అనేకములు మాత్రమేకాక ఛాందోగ్య బృహదారణ్యకోపనిషద్వచనములుకూడ తెలుపుచున్నవి.

'ఇతి-హ-ఆస-' 'ఈ విధముగా జరిగి ఉండెనట.' అని ఈవిధముగా ఆరంభించి ప్రాచీన కాలమున జరిగిన విషయములను ప్రతిపాదించునవి ఇతిహాసములు; 'మొదట ఇటువంటి స్థితి ఉండగా దానినుండి ఈఈ విధముల సృష్టి జరిగెను. దానినుండి ఈ దృశ్య ప్రపంచము రూపొదెను. అది ఇట్లు స్థితి నంది-ఇట్లు లయమునంది తన మూల తత్త్వమును చేరును.' అని ప్రతిపాదించునవి పురాణములు. అని ఉపనిషద్‌ (ఛాం-7అ. 1 ప్రపా; బృహ. 2అ; 4 బ్రా.) వచనములబట్టియును వానిపై శ్రీ శంకర భగవత్పాదుల భాష్యమును బట్టియును తెలియుచున్నది.

కాగా సృష్టికి పూర్వపు స్థితితో ఆరంభించి సృష్టిస్థితి లయముల ప్రక్రియలను-స్థితి కాలమునందలి లోక ప్రవృత్తికి కావలయు ధర్మముల స్వరూపమును-సర్వ ప్రకృతియు లయము పొందినపుడు ఈ జగత్తులన్ని యు పరమాత్మ తత్త్వముతో ఒకటియగు ప్రకారమును-తెలుపుటతోపాటు సర్వ ప్రాణులును ఆయా సాధనములతో పరమాత్ముని అను గ్రహమును పొంది జనన మరణ పరంపరా రూపమగు సంసార బంధమునుండి మోక్షమునందు విధానము ఇది. అని ప్రతిపాదించుట పురాణములు చేయు ముఖ్యకృత్యము.

ఇతిహాసములు ఏదోయొక వృత్తాంత విశేషమును మాత్రము కథారూపమున ప్రతిపాదించుచు ప్రాసంగికముగా ఐహికాముష్మిక ధర్మములను కూడ అందజేయును.

అని దీనినిబట్టి తెలియుచున్నది.

ఈ చెప్పిన వానిలో ఇతిహాస లక్షణములు భాగవతాది పురాణములయందును పురాణముల లక్షణములు భారతేతి హాసమునందును కనబడుచున్నను 'ఇతిహాసము' అను పదము శ్రీమన్మహాభారతమునందును 'పురాణములు' అను నామము శ్రీమద్భాగవతాదులయందును రూఢమయి ఉన్నది.

ఇంతియకాదు; ఇతిహాస పురాణముల వలన శ్రుతి వచనములకును అవి ప్రతిపాదించు అనేక ప్రామాణికాంశములకును ఎంతయో బలము సమకూరును. ఈ విషయమును ఈక్రింది 'మను' వచనము తెలుపుచున్నది.

''బిభే త్యల్పశ్రుతా ద్వేవో మా మయం ప్రహరే దితి|

ఇతిహాస పురాణాభ్యాం వేదా న్సముపబృంహయేత్‌.''

ఇతిహాస పురాణములను సరిగా అధ్యయనము చేయక అల్పముగా శాస్త్రాధ్యయనము చేసినవాని వలననుండి 'ఈతడు నన్ను దెబ్బకొట్టునేమో!' (శ్రుతికి అనుచితములగు అర్థములను కల్పించునేమో!) అని వేదము భయపడునట. కనుక శ్రుతికి కలుగు అటువంటి భయము పోగొట్టవలయుననినచో ఆయా వేదాంగ శాస్త్రములను అధ్యయనము చేయుటతో పాటు ఇతిహాస పురాణములను కూడ సరిగా అధ్యయనము చేసి వాటి అర్థములను శాస్త్రబలముతో సరిగా గ్రహించి వీటి తోడ్పాటుతో వేద ప్రతిపాదితార్థమును పోషించవలయును.''

ఈ శ్లోకమున మనువు పేర్కొనినవి ఋషి-ముని-ప్రోక్తములగు శ్రీ భాగవత-భవిష్యదాది మమాపురాణములను భారతేతిహాసమును-అగునుకాని ఛాందోగ్య బృహదారణ్యకములందు పేర్కొనిన వైదిక పురాణతిహాసములుకావు.

ఆపస్తంబాది మహామునులు తాము రచించిన ధర్మ సూత్రములందు భవిష్యాది పురాణములలోనివి అని ధర్మ విషయక నియములను ప్రతిపాదించు శ్లోకములను వచనములను ఉదాహరించి ఉన్నారు. దీనినిబట్టి కూడ పురాణములందు ప్రతిపాదింపబడిన ధర్మములకు ఎంతయో ప్రామాణ్యము కలదను అంశమును పురాణ రచనల ప్రాచీనతయు సమర్థింపబడుచున్నవి.

శ్రీ శంకర భగవత్సాదాదులగు ప్రస్థాన ప్రవర్తకాచార్యులు తమ భాష్యాదులందు-బ్రహ్మసూత్రములందును ఉపనిషత్తులయందును ప్రతిపాదించబడిన విషయములకు సమర్థకములుగా-భారతమునుండియు పురాణములనుండియు ఆయా సందర్భములందు ఆయా వచనములను ఉద్ధరించుటను బట్టియు శ్రుతి వచనములను సమర్థించుటకు పురాణతిహాస వచనములు ఎంతగా ప్రామాణికములుగా ఉపయోగించునో తెలియును.

పురాణములు ధర్మములను ప్రతిపాదించు రీతిలో ఒక విశిష్టత యున్నది. శ్రుతులును న్మృతులును పురాణములును ఇతిహాసములను ధర్మమును ప్రతిపాదించుటలో సమాన యోగ్యత కలవి కావచ్చును. ఐనను ఇందు శ్రుతులు ప్రభు సదృశమయినవి. ప్రభువు ప్రజలను 'మీరు ఈ విధముగ ప్రవర్తించవలయును. లేనియెడల దండింపబడుదురు.' అని శాసించును. తానాజ్ఞాపించినట్లు నడచుటవలని ప్రయోజనము ఏమి? నడువనియెడల కలుగు హాని ఏమి? అను విషయమును ప్రజల హృదయములకు ఎక్కునట్లు ప్రభువు వారికి బోధించడు. అదే విధముగ శ్రుతులును 'సత్యం వద' 'ధర్మం చర' ఈ మొదలగు రూపమున ధర్మాచరణమును విధించును. ఆచరించకపోవుటచే కలుగు పాపము ఇట్టిది యని తెలిపిన తెలుపును; లేకున్నలేదు. అంతియేకాని ఈ ధర్మాచరణము వలన లోక వ్యవహారగతిలో కలుగు మేలు కాని విరుద్ధాచరణము వలన కలుగు కీడుగాని ఇది-యని శ్రుతులు వివరించవు. స్మృతులును శ్రతులవలెనే ధర్మ ప్రతిపాదనము చేయును. కాని పురాణములు చేయు ధర్మ ప్రతిపాదన ప్రకారము ఇట్టిదికాదు అవి సన్మిత్రులు తమ మిత్రులకు చేసినట్లు సదుపదేశము చేసి వారిని ధర్మ మార్గమున ప్రవర్తింపజేయును. రామునివలె వర్తించుటచే మేలు కలుగును. రావణునివలె వర్తించుట హానికరము. అను ఇట్టి ఉదాహరనములతో ఇవి ధర్మోపదేశము చేయును. ఇందుచేత మానవులకు ధర్మమునందు ప్రవృత్తియు అధర్మమునుండి నివృత్తియు సుఖతరముగ కలుగును.

మరొక హేతువుచేకూడ పురాణములు సర్వజన సమాదరణీయములు. శ్రుతులకు సంబంధించిన భాష సంస్కృతమే అయినను అది లౌకిక సంస్కృతముకంటె చాల అంశములలో భిన్నముగా నుండును. దానికి స్వర వ్యవస్థయున్నది. సంప్రదాయానుసారముగ అధ్యయనము చేయక దానిని చదువరాదు. అంతేకాక వానికి అంగ భూతములగు వ్యాకరణము మొదలగు శాస్త్రములను అధ్యయనము చేయనిదే-వాని సహాయమున ఆయా వేద ప్రతిపాది తాంశములను తరచి చూడనిదే-వేద ప్రతిపాదితార్థములను సరిగా గ్రహించుట సుసాధ్యముకాదు. పురాణములు ఆవిధముగా కాక సులభ గ్రాహ్యమగు సంస్కృత భాషలో సరళ శైలిలో ఆయా ధర్మములను ఆయా విషయములను జనులకు ఆందజేయును. ఇందుచే ఇవి సర్వజన సమాదరణీయములు.

కాని కాల ప్రభావమున ఈ సరళ సంస్కృతము కూడ చాలమందికి అందుబాటులో లేకపోవుటచే వీనిని దేశ భాషలలోనికి అనువదించి జన సామాన్యమునకు అందించవలసివచ్చుచున్నది. అనుట వేరు విషయము.

పురాణ శబ్దమునకు పండితులు తెలిపిన ప్యుత్పత్తులు ఈ విధముగా నున్నవి. 1 పురా-భవమ్‌; పూర్వము నందు ఉన్నది; పూర్వమునందు జరిగిన విషయమును తెలుపునది; అను అర్థమున-పురా+అన>పురాణ; (అష్టా-4అ-2పా-23 సూ.); 2. పురా7పి నవమ్‌ ; 'పూర్వము ఎప్పుడో రచింపబడినదై నను ఎప్పటికిని క్రొత్తదిగానే ఉండునది' అను అర్థమున పురా+నవ>పురాణ ('నవ'లోని-'వ' లోపించును; (భగ-2అ. శ్లో. శాంకరభాష్యము); 2 'పురా' అను అవ్యయమునకు' 'ఇంతకు మునుపు' ''ఇకముందు'' అను రెండర్థములు కలవు; పురాణములు సృష్టికి పూర్వ స్థితితో ఆరంభించి ఇకముందు రాబోవు వృత్తాంతమును కూడ తెలుపును; కావున ఈ అర్థమున-పురా+అణ>పురాణ; ఇచ్చట 'అణ' ధాతువునకు 'శబ్దము; అర్థమును ప్రతిపాదించునది' అని అర్థము; (చూ. అమరకోశసుధా వ్యాఖ్య) వీనియందును మూడవ వ్యుత్పత్తి పురాణములు ప్రతిపాదించు అర్థమును స్పష్టముగా సూచించునని తోచుచున్నది.

ఇందులకు తగినట్లు పెద్దలు పురాణ లక్షణములను ఇట్లు తెలిపియున్నారు.

''సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ|

భూమ్యాదే శ్చైవ సంస్థానం పురాణం పంచలక్షణమ్‌.''

ఈ శ్లోకపు మూడవ పాదమునకు 'వంశాను చరితం చైవ' అనునది పాఠాంతరమని అమరకోశ సుధావ్యాఖ్య.

1. సర్గము 2. ప్రతిసర్గము 3. వంశము 4. మన్వంతరములు 5. భూమ్యాదుల సంఎ్థానము (వంశాను చరితము) అనునవి పురాణములందుండవలసిన పంచలక్షణములు.

1. సర్గము: పరమాత్ముని మాయా విలాసముచే అవ్యాకృత(మాయాశబల)తత్త్వము-దానినుండి మహత్తత్త్వము-దానినుండి అహంకారతత్త్వము-దానినుండి సూక్ష్మ భూతములు-జనించుట.

2. ప్రతి సర్గము: 'హిరణ్యగర్భుడు' అను ప్రథమ జీవుని మానసపుత్త్రలగు మరీచ్యాది మానసపుత్త్రుల వలన జరిగిన చరాచరసృష్టియంతయు.

3. వంశము: ప్రజాపతులనుండి సృష్టి క్రమమున కొనసాగిన ఆయా ఋషులయు-రాజులయు-ఆదివంశములు.

4. మన్వంతరములు : స్వాయంభువుడు మొదలగు మనువులను వారి వారిపాలన కాలమున జరిగిన-జరుగు-విషయములను ఆయా మన్వంతరములయందలి సప్తర్షులు-ప్రధాన మునులు మొదలగు వారిని-ప్రతిపాదించుట.

5. భూమ్యాదుల సంస్థానము: అనగా భూగోళ-ఖగోళ (జ్యోతిస్సుల వ్యవస్థలు; తత్తద్ద్వీప-వర్ష-ఖండములందలి ప్రధాన పర్వత సముద్ర నద్యాదికమును భారతవర్షమునందలి నదీ పర్వత సముద్రాదికమును పవిత్ర తీర్థ క్షేత్రాదికమును వారి మాహాత్మ్యమును భగవదవతార వృత్తాంతములను ప్రతిపాదించుటయు ఖగోళ (నక్షత్ర గ్రహాది జ్యోతిర్గోళ) వ్యవస్థా ప్రతిపాదనమును.

ఇందు 1. మన్వంతరాది రూపమున కాలవ్యవస్థను యుగధర్మ ప్రవృత్తిని ఎరుగుటయు తత్తత్త్వమును విచారించుటయు భగవంతుని కాలరూపునిగా ఉపాసించుట యగును. 2. భూగోళ వ్యవస్థా జ్ఞాన-తద్విచారణములు భగవానుని దేశ రూపునిగా ఉపాసించుట యగును జ్యోతిర్గోళములు కాల నియమానుసారము సంచరించును. భూమివలెనే తమ తమ స్థానములందుండి తామును కర్మదేవాదులకు ఆశ్రయ స్థానములయి యుండును. వానినుండి కాంతియు కాలక్రమమున విశ్వమున వ్యాపించి అందలి ప్రాణులపై పదార్థముల పై తమ ప్రభావమును చూపును. ఇట్లు దేశకాలాత్మకరూప ద్వయముతో నున్న ఖగోళపు తత్త్వమును ఎరిగి విచారించుట భగవానుని దేశ కాలరూపునిగా ఉపాసించుట యగును.

5. వంశాను చరితము: ఆయా రాజవంశములందు జనించిన రాజుల పాలనము మొదలగు వాటిని గూర్చిన కథలను ప్రతిపాదించుట.

'ప్రతిసర్గము' అనగా ప్రళయము అనియు అర్థము; కావున పురాణములందు సృష్టిక్రమ ప్రతిపాదనముతోపాటు ప్రళయక్రమమును తెలుపబడును.

మహాపురాణములు అన్నియు శివునిగాని విష్ణునిగాని పరమ దైవతముగా ప్రతిపాదించుచు ఉన్నవి. శ్రీదేవీ భాగవతములో శక్తి తత్త్వమును పరమార్థ త్తత్త్వమును ప్రతిపాదించుట జరిగినది. ఈ శక్తితత్త్వము పరమాత్మ తత్త్వముతో అవిభాజ్యమైన ఇచ్ఛాశక్తి రూపమైనది. కనుక శివకేశవుల భేదభావనకు ఏ మాత్రమును ఆస్పదములేని పరమాత్మ తత్త్వమే శ్రీదేవీ భాగవతములో ప్రతిపాదింపబడి ఉన్నది.

సాత్త్వికములు రాజసములు తామసములు అని పురాణములు గుణబేదమును అనుసరించి విభజింపబడి ఉన్నట్లు కొందరు సంప్రదాయజ్ఞలు చెప్పుచున్నారు. ఈ విషయములో గ్రమించబడిన గుణత్రయమును పరమాత్ముడు సృష్టి స్థితి లయములను నిర్వహించుటకు మూర్తిత్రయములో నిలిపిన ఆనంద-ప్రవృత్తి-నివృత్తి రూపములగు మూడు గుణములే కాని సుఖరాగ మోహరూపములగు లౌకిక సత్త్వ రజస్తమస్సులు కావు.

ఈ పురాణములకు అన్నిటికి కర్త శ్రీవేదవ్యాస మహాముని అని సంప్రదాయా గతముగా సిద్దించిన విషయము. ''అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీ సుతః'' అని చెప్పబడిన శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాస భగవానుడు ఈయనయే.

ఈ మహాముని వీటిని రచించిన స్థానము భూలోకములో అంతటిలో మొట్టమొదటి విద్యాపీఠము ఐన శ్రీబదరికాశ్రమము. దానియందలి మొదటి గురుశిష్యులు ధర్ముని పుత్త్రులైన నరనారాయణులు. కనుకనే ఈ రెండంశములను స్ఫురింపచేయుచు శ్రీవ్యాసులు భారతేతిహాసారంభములోను పురాణముల ఆరంభములోను

''నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌ |

దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్‌.''

''నరో(పురుషో)త్తములగు నరనారాయణులను సరస్వతీదేవిని నమస్కరించిన తరువాతనే 'జయం' అను పేర నేను రచించిన ఈ ఇతిహాస పురాణములను ప్రవచించవలెను.''

అవి శిష్యులను ఆదేశించినారు. ఈ పురాణములను ఇతిహాసమును లో(రో)మహర్షణుడు (రౌమహర్షణి) అను సూత మహాముని-వ్యాస శిష్యుడు-నై మిశారణ్యములో ద్వాదశ వార్షికబ్రహ్మ సత్రయాగ ప్రసంగమున కూడిన మునులకు వినిపించినాడు. క్రమముగా అవి లోకములో ప్రచారము పొందినవి.

ఈ పై శ్లోకములో పేర్కొన బడిన సరస్వతీదేవియే కాశ్మీరములోని శ్రీశారదాదేవియును తరువాత శ్రీశంకర భగవత్పదుల చేత ఆయా జగద్గురు పీఠములలో ఆరాధనీయగా నిలుపబడిన శ్రీశారదాదేవియును అని ఊహించవచ్చును.

జయశబ్దము సూచించు అర్థమును-పురాణముల ఇచ్చు సందేశమును.

వేదశాస్త్రములు విధించినట్లు సత్కర్మములను ఆచరించి మానవులు సర్వభూతములకును క్షేమమును ఇహపరసుఖములను చిత్తశుద్ధిద్వారమున మోక్ష సాధనాధికారమును మోక్షమును కూడ సిద్దింపచేసికొనవలయును. అనునది పురాణములు అందించు సందేశము. ఈ అంశమును పై శ్లోకములోని 'జయ' పదము సూచించును.

'జయ' పదమును తలక్రిందుగా చదివినచో 'యజ' అగును. 'యజించుము!' 'దేవతలను ఆరాధించుము!' అనియు 'ఇజ్యతే' 'యజించబడువాడు.' 'విష్ణువు' అనియు అర్థములు. యజ్ఞములలో ప్రధానముగా ఆరాధనీయతత్త్వము అయిన ప్రజాపతి సప్తదశ దేవతాత్మకము. ఈ తత్త్వమును శ్రుతి 'ఆశ్రావయ' 'అస్తు శ్రౌషట్‌' 'యజ' 'యేయజామహే' 'వౌషట్‌' అను అక్షరములతో తెలుపుచు ఉన్నది. ఈ శ్రౌత ప్రజాపతిని ఆరాధించుట ద్వారమున ఆరాధింపబడు ప్రధాన తత్త్వము శ్రీమహావిష్ణువే. ఈ అంశమును:

''చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభి రేవచ|

హూయతే చ పున ర్ద్వాభ్యాం -స మే విష్ణుః ప్రసీదతు ''

''నాలుగు-నాలుగు-రెండు-ఐదు-రెండు-వీటితో హోమమున అర్చన చేయబడు విష్ణువు నన్ను అనుగ్రహించవలెను.''

శ్రీమన్మహాభారతమ్‌.

అని శ్రీవ్యాస భగవానులు చెప్పినారు.

ఈ అంశము శ్రీమద్రామాయణములో అరణ్యకాండమున 12వ సర్గలో కూడ చెప్పబడి ఉన్నది.

'అగ్నిముఖా వై దేవా' 'అగ్ని మీళే పురోమితమ్‌' అని శ్రుతి. మానవులు అందించు హవిస్సు దేవతలకు అగ్ని ద్వారముననే అందును. యజ్ఞము చేత తృప్తి పొంది దేవతలు అనుగ్రహింతురు. పర్జన్యుడు అనుగ్రహించి వర్షించును. సోముడు అనుగ్రహించి ఓషధులను ఫలింప చేయును. దానివలన అన్నము సిద్ధించును. అన్నము వలన ప్రాణుల ఉత్పత్తి వృద్ధులు జరుగును. ఇక్కడ ప్రాణశక్తి రూపుడయిన అగ్ని హవిస్సును హుతముచేసి దాని సారభూతతత్త్వమును దేవతలకు ఆహారముగా అందించుచున్నాడు. సోముడు ఓషధీరూపముతో పరిణామము పొంది ప్రాణికోటులకు ఆహారము సమకూర్చును. ఈ విధముగా 1. అగ్నియు 2. సోముడును 1. 'అత్త' 'తినువాడు' 2. 'ఆద్యము' 'తినబడు నది' అను రెండు రూపములలో లోకప్రవృత్తికి కారణభూతు లగుచున్నారు. ఈ విధముగా అగ్నీషోమీయ తత్త్వము పరమాత్ముని విరాడ్‌ దేహములో ప్రధానాంశము అగుచున్నది. ఈ అంశము కొంతనిగూఢముగా శ్రుతులలోను పురాణములలోను ఇతిహాసములలోను చెప్పబడి ఉన్నది. (చూ. బృహ. అ. 1-బ్రా-కండిక-6; ప్రశ్నోప. ప్రశ్న. 1-4)

ఈ అగ్నీషోముల సమాహార-(కలిసిన)రూపము ఆదిత్యుడు; అతడు ప్రకాశించుచుండు పగటి కాలములో అగ్నియు చంద్రుడును తమ ప్రకాశము చూపజాలరు. కాని సూర్యుడు తనలోని అగ్న్యంశముతో భూతములకు ప్రాణశక్తిని అందించును. కాని అందుచేత భూతములకు తాపమునుశ్రమమును కలుగును. రాత్రి వేళలలో సోముడు భూతములకు తాపమును శ్రమను పోగొట్టి జీవనశ క్తిని ఇచ్చి పోషించును. అగ్నియు సోముడును రాత్రులలో తమ ప్రకాశమును బాగుగా చూపగలుగుట ప్రత్యక్ష గోచరము. కనుకనే పరమాత్మ ధావనతో ఆదిత్యుని భారతీయులు ఉపాసింతురు. ఈ సూర్యుడే ప్రాణుల శరీరములలో ముఖ్య ప్రాణత త్త్వరూపముతో ఉన్నాడు. అని ఛాందోగ్యోపనిషత్ప్రథమాధ్యాయములో చెప్పబడి ఉన్నది. రవి అగ్నీషోమ తత్త్వరూపుడు అను అంశము బ్రహ్మపురాణములో 32-179 అధ్యాయములలో చెప్పబడి ఉన్నది.

ప్రజాపతి పరంపరలోనివారైన ప్రచేతులకు సోముడు తన కన్య అయిన మారిషను ఇచ్చి వివాహము చేయగా వారికి జన్మించిన దక్షుని వలన లోకములో ప్రజావృద్ధి జరిగినది. ఈ వృత్తాంతము బ్రహ్మపురాణము-శ్రీమద్భాగవతము మొదలైన పురాణములలో ప్రతిపాదింపబడి ఉన్నది. ఇందులో ప్రచేతులు ఆదిత్యునకును మారిష సోమునకును ప్రతీక.

ఇటువంటి అగ్నీషోమీయ తత్త్వము ప్రజలకు క్షేమము కలిగించునట్లు చూచుటయే యజ్ఞముల ప్రధానోద్దేశ్యము.

''దేవా న్భావయతానేన తే దేవా భావయంతు వః |

పరస్పరం భావయంతః శ్రేయః పర మవాప్స్యథ.''

''అన్నా ద్భవంతి భూతాని పర్జన్యా దన్నసంభవః|

యజ్ఞా ద్భవతి పర్జన్యో యజ్ఞః కన్మ సముద్భవః.''

''కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్‌|

తస్మా త్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్‌.''

ఇత్యాది భగవద్గీతావచనములు ఈ విషయముచే ప్రతిపాదించుచున్నవి.

ఈవిధముగా 1. ప్రాణులకు క్షేమము సమకూర్చు యజ్ఞ ప్రాశ స్త్యమును 2. దానిలో ఆరాధింపబడు ప్రధానతత్త్వమును. 3. యజ్ఞమును ఆచరించుట కర్తవ్యము అను ఉపదేవమును 'జయ' పదములో ఇమిడి ఉన్నది.

ఇది కాక అక్షరములు సంఖ్యలను సూచించు సంప్రదాయానుసారము-జ=8; య=1; దీనిని కుడినుండి ఎడమకు చదువగా 18; ఈ సంఖ్య సప్తదశ సంఖ్యా ప్రతిపాదక యజ్ఞాత్మక ప్రజాపతి(17)ని యజ్ఞములో ప్రధానముగా ఆరాధ్యత త్త్వము ఐన విష్ణు (1) నికలిసిన మొత్తము సంఖ్య అగును. ఇది వ్యాసరచిత పురాణముల సంఖ్యనుకూడ తెలుపుచున్నది.

పురాణములు-మహా పురాణములు-ఉపపురాణములు అని-రెండు విధములు. అందు మహాపురాణములు:

శ్లో. 'మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయమ్‌ |

అనాపకూస్కలింగాని పురాణాని పృథక్‌ పృథక్‌.'

'మ' తో ఆరంభమగు పేరులుగల మార్కండేయ మత్స్యపురాణములు రెండు; 'భ'తో ఆరంభమగు నామము కలవి భవిష్య-భాగవత పురాణములు రెండు; 'బ్ర' తో ఆరంభమగు పేరులతో బ్రమ్మ-బ్రహ్మాండ- బ్రహ్మవైవర్త పురాణములు మూడు; 'వ' తో మొదలగు నామములు కల విష్ణు వారాహ వామన వాయు పురాణములు నాలుగు; 'అ' 'అగ్ని' - 'నా' 'నారద' 'ప' 'పద్మ' 'కూ' 'కూర్మ' 'స్క' 'స్కంద' 'లిం' 'లింగ' 'గారుడ' పురాణములు ఆరు; ఇవి 18 మహాపురాణములు. వీని యందలి శ్లోక (గ్రంథ) సంఖ్య :

----------------------------------------------------------------------------------------------------

క్ర.సం. పురాణనామము నారదపురా శ్రీదేవీభాగవ మత్స్యపురా విశేషము

ణానుసారి తానుసారి ణానుసారి

శ్లోక సం. శ్లోక సం. శ్లోక సం.

----------------------------------------------------------------------------------------------------

1. బ్రహ్మ 10000 10000 10000

2. పద్మ 55000 55000 55000

3. విష్ణు(ధర్మోత్తరముతో) 23000 23000 23000

4. శివ 24000 (24000) ఇది మత్స్యపురాణమున చెప్పబడలేదు.

5. దేవీభాగవత 18000 18000 18000

6. నారదీయ 25000 25000 25000

7. మార్కండేయ 9000 9000 9000

8. అగ్ని 16000 16000 16000

9. భవిష్య 14000 14500 14500 ప్రస్తుతము ఇందు 27500 శ్లో. కనబడు చున్నవి.

10. బ్రహ్మవైవర్త 18000 18000 18000

11. లింగ 11000 11000 11000

12. వారాహ 24000 24000 24000

13. స్కాంద 81000 81000 101000

14. వామన 10000 10000 14000

15. కూర్మ 17000 17000 17000

16. మత్స్య 15000 14000 14500

17. గారుడ 19000 19000 19000

18. బ్రహ్మాండ 12000 12100 12200

వాయు 24600 12000 ఇది నారదపురాణమున చెప్పబడలేదు.

----------------------------------------------------------------------------------------------------

మొత్తము 400100 401200 402200

----------------------------------------------------------------------------------------------------

ఉపపురాణములు :1. సనత్కుమారము 2. నారసింహము 3. నారదము 4. శైవము 5. దౌర్వాసము 6. కాపిలము 7. మానవము 8. ఔశనసము 9. వారుణము 10. కాళికము 11. సాంబము 12. నందికృతము 13. సౌరము 14. పారాశరము 15. ఆదిత్యము 16. మా హేశ్వరము 17. శ్రీమద్భాగవతము 18. యోగవాసిష్ఠము. ఈ ఉపపురాణముల నామముల విషయమున మతభేదమును కలదు. వీనిలో మహాపురాణములలో ఉన్నవే కొన్ని ఈ ఉపపురాణములలో కనబడుచున్నవి. వీని విషయమున కలుగు సందేహములను సంప్రదాయజ్ఞుల వలన తీర్చికొనదగును.

పురాణములు సాధారణముగా విష్ణునిగాని శివునిగాని వరదైవతముగా ప్రతిపాదించును.

పురాణములు ఈ గుణభేదము ననుసరించి సాత్త్వికరాజస తామస భేదమున విభజింపబడినట్లు సంప్రదాయజ్ఞులు చెప్పుచున్నారు. ఈ విషయమున గ్రహింపబడిన గుణత్రయమును పరమాత్మ తాను సృష్టి స్థితిలయముల నిర్వహించుటకై మూర్తిత్రయమందు నిలిపిన ప్రవృత్తినివృత్త్యానందరూపములగు గుణత్రయమే కాని సుఖరాగ మోహరూపములగు లౌకిక సత్త్వరజస్తమో గుణములు కావు. అని లోగడ అనుకొంటిమి.

ఇటువంటి ఈ మూడు గుణములలో ఏ ఒకటియు ప్రాధాన్యము వహించక సమతాస్థితిలో అవిభక్తావస్థలో ఉండు ఉనికియే 'ప్రకృతి' అనబడును. ఇది వివిధవ్యక్తి సమష్టియగు 'మాయ'; మాయను ఉపాధిగా చేసికొనియు దానికి తాను అధీనుడుగాక దానినే తన యధీనమునందుంచుకొనిన పరమేశ్వరుని లీలావిలసితములే జగత్సృష్టి స్థితిలయాత్మక ప్రకృతి పరిణామమంతయును. ఈ విచిత్రప్రకృతి పరిణామవర్ణమును-ఈ విశ్వప్రవృత్తి దశాకాలమున ధర్మ రక్షణార్థము పరమాత్ముడు తాల్చు అవతారముల వర్ణనమును-పురాణముల యందు ప్రథానప్రతిపాద్య విషయము.

కావున ఇట్టి పురాణములు సకల శాస్త్రసారములు.

ఇవి సద్వినియోగమును అందినచో లోక క్షేమంకరములు. సద్వినియోగమును అందక కొందర స్వార్థమునకు మాత్రము ఉపయోగవడు కథల పుట్టగా చూడబడినపుడు 'పుక్కిటి పురాణములు' అనబడుచున్నవి. 'వాడు ఏమేమో పురాణము చెప్పుచు నాప్రాణములు తీయుచున్నాడు.' 'నీ పురాణముతో నాకు పనిలేదు.' -ఇటువంటి వ్యవహారము ఇందుచేతనే ఏర్పడినది.

ఐనను ఈ వాఙ్మయపు యథార్థ స్వరూప ప్రయోజనములను ఎరిగి ధర్మమార్గమున నడుచుటయు చిత్త వృత్తులను సరియగు మార్గములో నడిపించుకొనుటయు కర్తవ్యము.

ఈ సదుద్దేశముతోనే 'శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్ట్‌' అష్టాదశపురాణముల సంస్కృత మూలమును తెలుగు అనువాదముతో ఆంధ్రులకు అందజేయుటకు పూనుకొనినది. ఈ ప్రయత్నము వలన ఆంధ్రజనులు సదుపయోగము పొందవలయునని ఈ ట్రస్ట్‌ పక్షమున ఆశించు

హైదరాబాద్‌, సజ్జన విధేయుడు

26-9-1986 పాతూరి సీతారామాంజనేయులు.

Sri Matsya Mahapuranam-1    Chapters